కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు

ఒక్క చోట చేరి సంబూరాలు చేసుకున్న తెలంగాణ ప్రవాసులు.

అభినందనల సందేశం పంపిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు

కెనడా ప్రముఖ నగరం టోరంటోలో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ యేడాది జూన్ తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో ఉత్సవాలను నిర్వహించారు. టోరంటో, మిసిసాగ ఈ వేడుకలకు వేదిక అయింది.

తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అందరూ ఒక్క చోట చేరి తెలంగాణ ఆట, పాటలతో సందడి చేశారు. మూడు గంటలకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, ఆద్యంతం ఉత్సాహంగా గడిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్, ప్రొఫెసర్ కోదండ రామ్, ప్రముఖ కవి రచయిత అందెశ్రీ, ఇతర ప్రముఖులు టీడీఎఫ్ చొరవకు అభినందనల సందేశాలు పంపారు.

ప్రొఫెసర్ జయ శంకర్ స్ఫూర్తి, మార్గదర్శకత్వంలో 2005 లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ ఏర్పాటు చేశామని, ఉద్యమకాలంలో సొంత రాష్ట్రం కోసం ఎంత ఆరాట పడ్డామో, సాధించుకున్న తెలంగాణ అభివృద్ది, సంక్షేమం వైపు పయనించేలా తమ వంతు పాత్ర ఇప్పటికీ తెలంగాణ ఎన్నారైలు పోషిస్తున్నారని టీడీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేందర్ రెడ్డి పెద్ది తెలిపారు.

తెలంగాణ ఎన్.ఆర్.ఐ లు అంటే బతికేందుకు బయటి దేశం పోయినోళ్లు కాదు, రాష్ట్ర సాధనతో పాటు, నిర్మాణంలోనూ పాటు పడుతున్నామనే ఆదర్శంతో టీడీఎఫ్ పనిచేస్తుందని అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గార్లపాటి అన్నారు.

తెలంగాణ అస్థిత్వానికి కృషి చేసిన కవులు, కళాకారులను స్మరించి గౌరవిస్తూ, సన్మానించుకోవటం, అమరుల కుటుంబాలను తోచినంతలో ఆదుకోవటం తెలంగాణ డెవలప్ మెంట్ ద్వారా చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

ఇక కెనడాలో స్థిరపడాలని వచ్చే వృత్తి నిపుణులను అవసరమైన సలహాలు, సూచనలతో పాటు యేటా కెనడాకు వస్తున్న తెలుగు విద్యార్థులకు అండగా టీడీఎఫ్ నిలుస్తోంది. నిత్య జీవిత ఒత్తిడులను జయించేందుకు ఆటపాటలే మార్గం అని భావించి స్పోర్ట్స్ క్లబ్ ను ఏర్పాటు చేసి క్రికెట్ తో సహా వివిధ రకాల టోర్నమెంట్ ల నిర్వహణ కూడా డెవలప్ మెంట్ ఫోరం చేస్తోంది.

తెలంగాణకు భౌతికంగా దూరంగా ఉంటున్నా, పుట్టిన ప్రాంతంలో ఉన్న సంప్రదాయాలు, ఆచారాలు, పండగలకు దూరం కాకుండా టీడీఎఫ్ గొడుగు కింద కెనడాలో అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నామని,
తంగేడు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి యేటా బతుకమ్మ ఉత్సవాలతో పాటు, వివిధ సందర్భాల్లొ కమ్యూనిటీ ఈవెంట్ లను నిర్వహిస్తూ అందరం కలుస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
కెనడాలో పుట్టి పెరిగిన పిల్లలకు వారి మూలమైన తెలంగాణ పేగు బంధం కొనసాగేలా చూసుకుంటున్నామని తెలంగాణ నైట్ నిర్వాహకులు అన్నారు.

టీడీఎఫ్ వ్యవస్థాపక సభ్యుడైనటువంటి కీర్తిశేషులు గంటారెడ్డి మాణిక్ రెడ్డి పేరు మీద ఏర్పాటుచేసిన విశేష సమాజసేవ పురస్కారాన్ని పవన్ కుమార్ రెడ్డి కొండం దంపతులకు నిర్వాహకులు అందించారు.

ఈ కార్యక్రమంలో విశేష అతిథిగా అమెరికా నుంచి వాణి గడ్డం, భారత దేశం నుంచి సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ బందు హాజరయ్యారు.

కార్యక్రమంలో బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నెరవెట్ల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రమోద్ కుమార్ ధర్మపురి,
టీడీఎఫ్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు హాజరయ్యారు. ప్రోగ్రామ్ విజయవంతం అయ్యేందుకు సహకరించిన వాలంటీర్లకు నిర్వాహకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

(Visited 171 times, 1 visits today)

About The Author

You Might Be Interested In

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *