కబడ్డి ఆడుతూ గుండెపోటుతో మృతి. రోడ్డు దాటుతూ గుండె ఆగి మరణం. జిమ్ లో వ్యాయామం చేస్తూ మృతి. రాత్రి నిద్రలో గుండెపోటుతో మరణం. అంతకుముందు కొందరు సెలెబ్రిటీల గుండెలు ఆగిపోవడం. నిన్న గాక మొన్న సుస్మితా సేన్ కు గుండెపోటు వార్త. ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా గుండె కుదేలైన వార్తలు చూస్తున్నాం. అసలేంటీ గుండె తాలూకు మరణాలు, కోవిడ్, కోవిడ్ టీకా తదనంతర పరిణామాలపై సందేహాలు, ఎందుకిలా ఉన్నట్టుండి అందరి గుండెలు కుదేలైపోతున్నాయో అంతుచిక్కని పరిస్థితి. నిజానికి ఏదీ హఠాత్తుగా వచ్చిపడవు, ప్రతీ దానికీ ఓ కారణం, క్రమం ఉంటాయి, అందులో నిద్ర, ఒత్తిడి, వ్యాయామం, సామాజిక సంబంధాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, గుండె ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు మిలిటరీ వైద్యులు, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్, డాక్టర్ బఖ్తియార్ చౌదరి.