మా స్వస్థలం కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు. పుట్టింది మాత్రం మంటాడలో. అమ్మ కనకదుర్గ. గృహిణి. నాన్న సత్యానారాయణ. నాన్న దూరమయ్యేప్పటికి నాకు నాలుగేళ్లు. అప్పటికి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం మాది. మేం మొత్తం పదకొండు మంది సంతానం. అయిదుగురు అన్నలు, అయిదుగురు అక్కలు. నేనే ఆఖరివాణ్ని. నాన్న పోయాక, మాకన్నీ మా అమ్మే అయ్యింది. మా చదువుల కోసం ఆవిడ పడని కష్టం లేదు. చివరికి పరీక్ష ఫీజుకని తన చేతికున్న ఒక్క గాజును కూడా అమ్మేసింది. నేను చిన్నవాణ్ని కావడం వల్ల ఎక్కువకాలం ఆమె పడ్డ కష్టాల్ని దగ్గర్నుండి చూశాను. మేం బాగుపడాలని తన సర్వస్వాన్నీ త్యాగం చేసేందావిడ. అప్పుడే అనుకున్నాను, నేను వృద్ధిలోకి వచ్చాక ఆవిడ కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చాలని. నేను అమెరికా వెళ్లాక వచ్చిన తొలి జీతంతో ఇండియా వచ్చి ఆవిడ కోల్పోయినవన్నీ కొనిపెట్టాను.