పాలమూరు బిడ్డకు సివిల్స్ లో థర్డ్ ర్యాంక్
రోజుకు 14 గంటలు చదివాను.. సివిల్స్ లో థర్డ్ ర్యాంక్ వస్తదని ఊహించలేదు: దోనూరు అనన్య రెడ్డి.
హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో పాలమూరు మట్టి బిడ్డ మెరిసి పోయింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నం లోనే మూడో ర్యాంకు సాధించింది. ఆలిండియాలో థర్డ్ ర్యాంకు సాధించిన అనన్య కు అభినందనలు వెలువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా, అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామం మాది.. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ మిరాండ హౌస్‌లో జియోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేశాను. ఇక డిగ్రీ చదువుతున్న సమయం లోనే సివిల్స్ మీద దృష్టి సారించాను. దీంతో, రోజుకు 12 నుంచి 14 గంటల పాటు కష్టపడి చదివాను. ఆంథ్రో పాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాను. ఇందుకు హైదరాబాద్ లోనే కోచింగ్ తీసుకుని పకడ్బందీగా చదివాను. అయితే ఈ ఫలితాల్లో మూడో ర్యాంకు వస్తదని ఊహించ లేదు అని అనన్య రెడ్డి తెలిపారు. సామాజిక సేవ చేయాలనే తపన తనలో చిన్నపట్నుంచే ఉందన్నారు. ఈ క్రమం లోనే సివిల్స్‌పై దృష్టి సారించి సాధించాను. తమ కుటుంబంలో సివిల్స్ సాధించిన తొలి అమ్మాయిని తానేనని చెప్పారు. నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్ కాగా అమ్మ గృహిణి అని పేర్కొన్నారు.