Siddipet: తల్లే విలన్.. కొడుకే క్రిమినల్! ఈ దారుణాలు వింటే షాకవుతారు
ఒక తల్లి తన కొడుకును కంటికి రెప్పలా కాపాడాలి. కానీ ఇక్కడ మాత్రం అదే తల్లి డబ్బులు, బంగారం కోసం ఏకంగా కొడుకునే క్రిమినల్‌గా మార్చేసింది. అసలు ఈ తల్లి ఎందుకు అలా చేసింది? దీని వెనుక ఏం జరిగింది? సినిమాల్లో కనిపించే క్రైమ్ సీన్లను చూసి ఇలాంటి ఆలోచన వచ్చిందా? లేక మరేదైనా కారణం ఉందా. సిద్దిపేట జిల్లా భూంపల్లిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం భూంపల్లికి చెందిన చాకలి రజిత అనే మహిళ కిరాణా షాపు పెట్టుకుని బతుకుతోంది. ఈమె భర్త అనారోగ్యంతో మంచం మీద ఉన్నాడు. వీళ్లకు ఓ మైనర్ కొడుకు కూడా ఉన్నాడు. కానీ రజితకు కష్టపడకుండా ఈజీగా డబ్బులు రావాలనే బుద్ధి పుట్టింది. అందుకోసం అనేకరకాల అడ్డదారులు వెతికింది. ఆ క్రమంలో ఒంటరిగా ఉండేవాళ్లు, ఇంట్లో గొడవలు ఉన్నవాళ్లనే టార్గెట్ చేసుకుంటే ఎవరికీ అనుమానం రాదని ప్లాన్ వేసుకుంది. ఈ ప్లాన్ లో ఆమె తన కన్న కొడుకును ఇన్ వాల్వ్ చేసింది.
ఆ క్రమంలోనే ఈ ఏడాది మేలో 25 ఏళ్ల రేఖ అనే యువతిని ఫస్ట్ టార్గెట్‌గా ఫిక్స్ చేసుకున్నారు. రేఖ ఇన్స్టాగ్రామ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈమెను లేపేస్తే, ఎవరో కిడ్నాప్ చేశారనుకుంటారే తప్ప.. తమ మీద పడదని ప్లాన్ వేశారు. అనుకున్నదే తడవుగా ఆమెను మాయ మాటలతో నమ్మించి చంపేశారు. ఒంటి మీద ఉన్న బంగారమంతా దోచుకుని, శవాన్ని ఎవరికీ తెలియకుండా అడవిలో పెట్రోల్ పోసి కాల్చేశారు.
ఇక ఈ నెల 7న రజిత రెండో హత్యకు స్కెచ్ వేసింది. భూముల గొడవలు ఉన్న 45 ఏళ్ల విజయను టార్గెట్ చేసింది. ఈమెను చంపేస్తే అనుమానమంతా ఆ కుటుంబం మీదో, దాయాదుల మీదో పడుతుందని ముందే ప్లాన్ వేసింది. అలాగే విజయను గొంతు నులిమి చంపేశారు. శవాన్ని కాల్చాలని చూస్తే సందులో వర్షం పడింది. దీంతో రామక్కపేట దగ్గర రోడ్డు పక్కనే సగం కాలిన బాడీని పడేసి పారిపోయారు. స్థానికులు చూసి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో అసలు విషయం బయటపడింది.
రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ పుటేజీలు అన్నీ వెతికారు. ఫైనల్‌గా రజిత, ఆమె కొడుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చి అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను విచారించేసరికి పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఈ రెండు మర్డర్లే కాకుండా, జూన్ నెలలో అన్నపూర్ణ అనే మరో మహిళ మీద దాడి చేసి ఆమె మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్లారు. ట్విస్ట్ ఏంటంటే.. అనారోగ్యంతో మంచాన ఉన్న తన భర్త దుబ్బయ్య పేరు మీద లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించి, ఆయన్ను కూడా లేపేయాలని ప్లాన్ చేసింది. వీళ్లతో పాటు ఇంకా ముగ్గురు మహిళలను కూడా చంపేయడానికి ప్లాన్లు వేసి సిద్ధంగా ఉన్నారట. ఈ లెక్క చూస్తే ఈ తల్లి కొడుకులు ఒక సైకో గ్యాంగ్‌లా తయారయ్యారని పోలీసులు వెల్లడించారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రమేశ్ ఈ కేసు వివరాలన్నీ వివరించారు. నిందితుల దగ్గర నుంచి దాదాపు 10 లక్షల రూపాయల బంగారం, వెండి నగలూ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితురాలైన రజితను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఆమె కొడుకు మైనర్ కావడంతో జువైనల్ హోమ్‌కు పంపినట్లు చెప్పారు. ఈ క్రమంలో తెలియని వారితో మెలిగేటప్పుడు, చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంటాయో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఎవరినీ గుడ్డిగా నమ్మోద్దని సూచించారు.